Saturday, 19 March 2016

వ్యభిచారం.....ఒక అపచారమా????.......ఒక గ్రహచారమా????

వ్యభిచారం.....ఒక అపచారమా????.......ఒక గ్రహచారమా????


నేను నిన్న “పవిత్ర” సినిమాకి వెళ్తా అంటే ఇంట్లో, బయటా ఫ్రెండ్స్ ఒక రకంగా చూసారు..కారణం, అది ఒక వేశ్య క్యారెక్టర్ పైన తీసిన సినిమా కాబట్టి.... పవిత్రలో క్లైమాక్స్ లో నాయకులనుద్దేశ్యించి పవిత్ర చెప్పే ఒక డైలాగ్ మైండ్ బ్లోయింగ్, అదేంటంటే “పడుకున్నావ్.....పడుకున్నావ్......అని నన్ను అంటున్నారే....మరి...మీరు ఇన్ని రోజులుగా ఈ దేశాన్ని పడుకోబెట్టలేదా??”......అలా ఇన్ డైరెక్ట్ గ వ్యవస్థలోని కుళ్ళు ని, అభివృద్ధి లేకపోవడాన్ని చెప్పకనే చెప్పింది...సమాజాన్ని దగ్గరగా చూడాలంటె సినిమాలనే చూడాలని నేను అనుకుంట....ఎందుకంటే సినిమా హిట్ ని బట్టి సమాజం ఎలా పోతుందో కొంత వరకు తెలుసుకోవచ్చనేది నా అభిప్రాయం....కమ్మింగ్ టు మూవీ......పవిత్ర అని ఒక అపవిత్రమైన వృత్తి చేసుకునే ఒక స్త్రీ యొక్క జీవితం లోని ఎన్నో సంఘటనలను సినిమాగా చిత్రించడమేగాక సమాజం లోని ఎన్నో కోణాల్ని దర్శకుడు స్పృశించాడు.భార్యభర్తల అనుబంధం,రాజకీయ నాయకుల కుళ్ళు కుతంత్రాలు, వాళ్ళు స్వార్థానికి దేశాన్ని దోచుకోవడం,ఆడవాళ్ల ఆసక్తిని అవకాశవాదంగా ఒక మగాడు మార్చుకుంటే, బలితెగించిన ఒక ఆడది ఆ మగాడ్ని ఎదుర్కొని అతన్ని జైలుకి పంపడం, దొంగ బాబాలు-వారి దోపిడీలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచగొండితనం, వేశ్యను కుటుంబ వ్యవస్థలోకి ఆహ్వానించడం లాంటి ఎన్నో అంశాల్ని చాలా బాగా చిత్రీకరించాడు.సినిమా వసూళ్ల పరంగా ఘన విజయం సాధిస్తుందో లేదో కాని ఒక వేశ్య పాత్రను మలిచిన తీరు విమర్శకులని మెప్పిస్తుంది.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఒక వేశ్య పాత్ర....అదే పవిత్ర.
                         వ్యభిచారం ఒక అపచరమా??...ఒక గ్రహచారమా??..కొందరు అపచారం అంటారు...కొందరు గ్రహచారం అంటారు..అపచారం అనుకుంటే అపచారం అవుతుంది.గ్రహచారం అనుకుంటే గ్రహచారం అవుతుంది.నాకు తెలిసీ ఏ యువతీ కూడా ఈ పడుపు వృత్తిలోకి మనసారా రావాలని కోరుకోదు.ఎందుకంటే వేశ్యా వృతి, నీట్ గా తయారయ్యి అందరిని హాయిగా పలకరించే ఎయిర్ హోస్టెస్ జాబూ కాదూ,అందరినీ హెల్లో!! అంటూ చిలకలా పలకరించే రిసెప్షనిస్ట్ జాబూ కాదు.పడుపు వృత్తి అనేది ఒళ్లు హూనం అయ్యే అతి క్రూరమైన, హృదయవిదారకమైన వృత్తి...ఏ ఆడపిల్ల కూడా ఒళ్లమ్ముకొని డబ్బులు సంపాధించుకోవాలనుకోదు.అలా అనుకునేది ఆడదే కాదు.ఆడపిల్లకు శీలమే ప్రాణం...ప్రాణం పోయినా పర్వాలేదు కానీ శీలం మాత్రం పోకూడదనుకుంటుంది.అలాంటి శీలాన్ని డబ్బు కోసం ఎవరూ అమ్ముకోరు.వారు ఈ వృత్తిలోకి రావడానికి సామాజిక, ఆర్ధిక, కుటుంబ మరియు కొంత వరకు రాజకీయ కారణాలు తోడయి ఉండొచ్చు.కారణాలేమయినా కావొచ్చు, కాని జీవితాన్ని మరియు సాంఘిక హోదాని కోల్పోయేది మాత్రం ఆడదే.......

                    ఆడవాళ్ళకు మరియు సమాజానికి ఈ దరిద్రం ఇప్పట్లో పట్టింది కాదు.ఇది మన తాత-ముత్తాతల కాలం నుండీ అంతకు పూర్వం నుండి ఉన్నదే.ప్రబంధ యుగం నాటి శ్రీనాథుడి కాలం రచనల్లో, మొల్ల కాలం నాటి రచనల్లో,, శ్రీ కృష్ణదేవరయకాలం నాటి రచనల్లో ఈ పడుపు వృత్తి ఘాటు వాసన కంపు కొడుతుంది.ఆ తర్వాత కూడాఈ దరిద్రం సమాజం లో ఉండనే ఉంది.రాజుల కాలం నుండీ ఈ నీచ ప్రవృత్తి కొనసాగుతుంది.ఎందరో రాజులకు ఎందరో ఉంపుడుగత్తెలు ఉండేవారు.సంపదలున్న వారు ఉంపుడుగత్తెలను ఉంచుకుంటే, లేని వాడు సానికొంపలను ఆశ్రయించాడు.ఇలా ఈ వృత్తికి మగాడూ కారణమే.పెళ్ళికాని మగాడు సుఖాల కోసం వెలతాడంటే సరే పెళ్లయిన మగాళ్ళూ దీనికి బానిసలయ్యారు.
 
                               మగాడు వేశ్యల దగ్గరికి వెళ్ళడానికి కుటుంబ వ్యవస్థ సరిగా ఉండకపోవడమే కారణం.మన ఇంట్లో కూర రుచిగా లేకపోతే పక్కింటి కూరకి ఎలా ఆకర్షితులమవుతామో, భార్యతో సుఖంగా లేనివాడు వేశ్యలకి ఆకర్షితుడవుతాడు.ఇక భార్య మంచిగా ఉన్నా వేశ్యల దగ్గరికేల్లె మగ వెధవల గురించి మాట్లాడుకోవడమే దండగ.ఆడపిల్లగా పుట్టిన ఏ యువతికైనా తనకొక కుటుంబం ఉండాలనీ, తను కూడా మిగితా వారిలాగా పిల్లా పాపలతో సుఖంగా గడపాలని కోరుకుంటుంది.కాని కొందరి పరిస్థితి పడుకుంటే కాని పూటగడవని పరిస్థితి.కొందరు వాదించొచ్చు పడుకునే బదులు ఏదయినా కష్టం చేసి బ్రతుకొచ్చు కదా అని.

                  వేశ్య కూతుర్ని వేశ్య గానే బ్రతకమంటుందీ సమాజం...పని కల్పించే అవకాశం, ఆశావాదం ఇటు సమాజం కానీ-అటూ ప్రభుత్వం కానీ వేశ్యలకు కల్పించవు.అంతెందుకు ఒక వేశ్య కూతుర్ని పనుల్లో పెట్టుకోమని ఎవరినన్నా అడగండి??దాదాపుగా ఎవ్వరు ఇష్టపడరు.ఇక వేశ్య కూతురు/కొడుకు చదువుకోడానికెల్తే అక్కడ వాళ్లకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు.అలా చదువు మానేసి పూట గడవని స్థితుల్లో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో చాలా మంది ఈ పనికిమాలిన వృత్తిలోకి మళ్లీ వస్తున్నారు.దీన్ని నివారించాలంటే ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించాలి.


                       వేశ్యలను మార్చడానికి ప్రభుత్వ పరంగా కృషి చెయ్యాలి...వేశ్యలు, వారి యొక్క ఆర్ధిక పరిస్థుల కారణంగానే దాదాపు ఈ వృత్తిలోకి వస్తున్నారు.కాబట్టి వారికి ఆర్ధిక సహకారాన్ని అందించాలి.చదువు యొక్క ప్రాధాన్యతను తెలిసేలా చేసి, చదువుకుంటే ఆర్ధికంగానే కాక సామాజికంగా హోదా లభిస్తుందని వివరించాలి. క్లైమాక్స్ లో స్ర్తీ రక్షణ మంత్రిత్వ శాఖ (Women Protection Ministry) పదవిని ఏర్పాటు చేసి ఆ శాఖని వేశ్య అయిన తనకు కేటాయించమని చావుబ్రతుకుల్లోని శ్రేయ ప్రాధేయపడటం మనస్సుకు హత్తుకునేల ఉంటుంది....ఈ వృత్తి ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రత్యేక పాటశాల ఉండేలా చర్య తీసుకోవాలి.ఈ సమస్యను రూపుమాపడానికి ఎన్.జి.ఒ (NGO) లని, ప్రజల్ని భాగస్వామ్యులని చెయ్యాలి. ఇలా అందరు కలిసి, వేశ్యలకు వాళ్ల వృత్తి వల్ల కలిగే శారీరకసమస్యల్ని, సాంఘిక బాధల్ని ప్రాక్టికల్ గ వివరించాలి.దీనికి ప్రభుత్వం శాయశక్తులాసహకారాన్నందించాలి.రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి వీరిపైన చిన్న చూపు ఉండకూడదు..ప్రభుత్వం ఆడవాళ్ళకి భరోసా ఇవ్వాలి, విమెన్ ట్రాఫ్ఫికింగ్ ని అరికట్టాలి.సమాజం కూడా దీనికి తోడ్పాటునందించాలి.వ్యభిచారం ఒక గ్రహచారం లాంటి అపచారం కాకుండా సమాజం లోని ప్రతి ఒక్కరితో పాటు ప్రభుత్వం కూడా కృషిచేసి దీన్ని రూపుమాపాలి.
జైహింద్

No comments:

Post a Comment