Saturday, 19 March 2016

"ఉరిశిక్ష????అవసరమా??? అనర్థమా????"

"ఉరిశిక్ష????అవసరమా??? అనర్థమా????"


ఒక దేశ అధ్యక్షుడు అయినటువంటి సద్దాంహుస్సేన్ అనే నేతను అమెరికా ప్రభుత్వం బహిరంగంగా ఉరితీయటం, అది ప్రత్యక్ష ప్రసారాలుగా కొన్ని ఛానెల్స్ ప్రదర్శించడాన్ని కొందరు తప్ప యావత్ ప్రపంచం విస్మయంతో ఖండించింది...భారతదేశం కూడా విస్మయం ప్రకటించింది....అలాంటి మన దేశంలో ఉరిశిక్ష అమలు ఎంత వరకు సబబు....

          రాజీవ్ గాంధీ హత్యోదంతంలో ‘‘పెరారివాలన్, శాంతన్, మురుగన్’’ లకు సెప్టెంబర్ 9న ఉరిశిక్ష అమలు పరచనున్నట్టు ప్రకటించడం దాన్ని ప్రస్తుతం ‘‘స్టే’’గా వుంచడం జరిగింది....ఇదే హత్యకేసులో నిందితురాలైన నళిని మరణశిక్షను యావజ్జీవకారాగార శిక్షగా క్షమాభిక్ష పెట్టడం ఇక్కడ గమనార్హం....అదుపులోకి తీసుకున్న 20 సంవత్సరాలకు వారికి ఉరిశిక్ష తేది ఖరారయింది.....రాష్ట్రపతికివీరందరు క్షమాభిక్షకు పిటిషన్ పెట్టుకొని 11సంవత్సరాల 4నెలలు అయింది...అంటే వీరందరు 136నెలల నుండి చస్తామో బతుకుతామో తెలియని పరిస్థితుల్లో ఉంటూ నరకయాతన అనుభవించారు.....ఈ జీవన్మరణ నరకయాతనను సమర్థించడం అవసరమా????
            ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 135 దేశాల్లో ఉరిశిక్ష రద్దు పరిచినారు, 25 దేశాలలో ఈ ఉరిశిక్ష అమలులో ఉంది...చైనా, ఇరాన్, ఇరాక్, సుడాన్, అమెరికా లాంటి దేశాలలో ఈ ఉరిశిక్షను 90 శాతం అమలుచేస్తున్నారు....మన దేశం విషయానికొస్తే T.V వాతీశ్వరాన్ Vs తమిళనాడు ప్రభుత్వం కేసులో మరణశిక్ష ఆలస్యానికి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పడితే దాన్ని జీవితఖైదుగా తీర్పు వెలువడింది.....తరువాత శేర్సింగ్ కేసులో ఇది చెల్లదని చెప్పబడింది...అంతేకాదు 2009లో జగదీష్ Vs మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఉరిశిక్షను జీవితఖైదుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.....2011లో 6కేసుల్లో క్షమాభిక్ష పెట్టబడింది.....

            భారతరాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి 72 నిబంధన ప్రకారం క్షమాభిక్ష పెట్టే అధికారం కల్పించబడింది....అదే రాజ్యాంగం అధికరణ 21 ప్రకారం పౌరుడికి జీవించే హక్కు ఇవ్వబడింది....దేశంలో ఉరిశిక్షను వద్దనే వాళ్ళన్నారు అలాగే ఉరిశిక్షను అమలు చేయాలనే వారూ ఉన్నారు…ఉరిశిక్షను అమలు చేస్తేనే నేరాలు తగ్గుతాయంటున్నారు....కానీ ఉరిశిక్ష అమలుల్లో ఉన్న ఏ దేశాల్లోనూ, మన దేశంలోను నేరాలు తగ్గలేదు....కానీ ఉరిశిక్ష అమలయిన తర్వాత ఏవేని కారణాల వల్ల అతను నిరపరాధి అని తేలితే అది క్షమించరాని నేరం.....కావున ఉరిశిక్ష కన్నా యావజ్జీవ కారాగార శిక్షకే మొగ్గు చూపాలి....కానీ కసబ్ లాంటి కరుడు కట్టిన తీవ్రవాదులు, అఫ్జల్ గురు లాంటి దేశద్రోహులు ఎంతోమంది అమాయకులను, పోలిస్ బలగాలను పొట్టన పెట్టుకున్నారు......అలంటి వారికీ క్షమాభిక్షను పెట్టడమో, యావజ్జీవ కారాగార శిక్ష ద్వారా మన జైళ్లలో పుష్టిగా ‘‘బిర్యానీ’’లు పెడుతూ పోషిస్తూ ఉంటే మాత్రం బాధిత వర్గాలు ఆవేదనకు గురికవడమే కాకుండా ప్రభుత్వంపైన తమ ఆక్రోషాన్ని వెల్లగక్కుతారు....ఇలాంటి కేసులతో సంబంధం ఉన్న ప్రత్యక్ష బాధితులు మరియు పరోక్ష బాధితులు ఉరిశిక్ష తప్పనిసరిగా విధించాల్సిందేనని ఆక్రోషించడం చాల పత్రికల్లోను, ఛానెళ్ళలోను చూస్తూ వుంటాం....కావున ఉరిశిక్ష అంటూ అమలు చేయాల్సివస్తే అది కరుడుకట్టిన తీవ్రవాదులకో, ఘోరనేరానికి పాల్పడిన వారికో విధించాలి...కొన్ని సందర్బాలల్లో సామాన్యజనం కొన్ని ప్రత్యేక నేరాలకు పరోక్ష సంబంధాలు కలిగి వుంటారు....అలాంటివారికి ఇలాంటి ఉరిశిక్ష లాంటి కఠినశిక్షలు వేయరాదు......

                అప్పటి సామాన్యుల్లో ఒకడైన పెరారివాలన్ అలియాస్ అరివు ఎలక్ట్రానిక్ డిప్లొమా చేస్తున్న సమయంలో శివరాసన్ కు బ్యాటరీ ఇచ్చిన కారణంగా తనను అరెస్టు చేసి హత్యానేరం మోపారని....రాజీవ్ హత్య నాటికీ {1991} ఎల్.టి.టి.ఇ (LTTE) నిషేధసంస్థ కాకపోయినప్పటికీ, దానితో అరివు సంబంధాన్ని ప్రాసిక్యూషన్ నేరంగా పరిగణించిందనీ, ఈ విషయాలన్ని అరివు రాసిన ‘‘యాన్ అప్పీల్ ఫ్రమ్ డెత్’’ లో విన్నవించుకున్నాడు....ఇందులో ప్రభుత్వానిది యధార్థమా???? అరివు వాదన సత్యమా???? ఇలాంటి వాటికి కారణం ఎవరు.....

                  అంతేకాదు ప్రియాంక గాంధీ సమాచారహక్కు చట్టం ద్వారా వెలువడిన సమాచారంతో మనం ఇంకో సామజిక కోణాన్ని అర్థం చేసుకోవచ్చు... తను పొందిన సమాచారంలో మానవబాంబుగా మారినటువంటి ‘‘థాను’’ భద్రతా సిబ్బందికి 100 రూపాయలు లంచంగా ఇచ్చి భద్రతా వలయాన్ని చేధించుకొని ఈ మహా ఘోరానికి పాల్పడి ఒక ప్రధానిని బలి తీసుకుంది..... అంటే రాజీవ్ గాంధీని మరియు ఇంకొంత మందిని బలి తీసుకుంది మానవ బాంబా ???? మనిషా ??? వ్యవస్థా ???? విశాల దృక్పతం తో ఆలోచిస్తే వ్యవస్థని నాశనం చేసింది మన వ్యవస్థే....ఇలా వ్యవస్థే నేరగాళ్ళను తయారుచేస్తూ ఉరిశిక్ష విధిస్తుంది..మన వ్యవస్థలోని విద్యా విధానాలు మార్కుల కోసం కాకుండా విలువలు పెంచేలా ఉండాలి...కాబట్టి వ్యవస్థలో విలువలను పెంచడానికి, ప్రగతిపాలన తీసుకురావడానికి, నేరాలను తగ్గించడానికి కృషిచేస్తూ సాధ్యమయినంత వరకు ప్రభుత్వం ఈ ఉరిశిక్షను అమలు చేసే పరిస్థితులు తలెత్తుకునేలా చూసుకోకపోవడం మంచిది..ఇక దేశద్రోహులు, ఉగ్రవాదులకు ఉరిశిక్ష విషయానికి వస్తే ప్రభుత్వం ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి.....ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే ఆ పనిష్మెంట్ చూసి ఏ ఒక్కరు నేరం చేయడానికి కూడా ఆలోచించని విధంగా ఉండాలి....
జైహింద్

No comments:

Post a Comment