Saturday, 19 March 2016

అసహనమా నువ్వెకడా????



అసహనమా నువ్వెకడా????





అవును.....నిజంగానే దేశంలో అసహనం పెరిగిపోతుంది....భారతదేశం నా మాతృభూమి , భారతీయుడిగా నేనెప్పుడూ గర్విస్తూ – ఘర్జిస్తూ ఉంటాను.అలా బ్రతికే ఈ దేశ సామాన్య మానవుల్లో ఒకడినైన నాకు అసహనం పెరిగిపోయింది....ఇది అలాంటి , ఇలాంటి అసహనం కాదు. దేశంలో ఈ మధ్య తలెత్తిన అసహనపు గాలుల వల్ల ఏర్పడిన అసహనం. దేశంలో ప్రస్తుత పరిస్తితులు నా సహనం కోల్పోయేలా చేసాయి...అసహనం నన్ను ఆవహించింది, అలా ఆవహించిన అసహనమే నాతో ఇలా రాయిస్తుంది.
గత కొన్ని రోజులుగా సామాన్య మానవుడిని నుండి దేశ ప్రధాని & రాష్ట్రపతి నోట్లో నానుతున్న పదం “అసహనం” . ఈ దేశంలో అసహనం ఎందుకు పెరిగింది? పెరుగుతోంది? భవిష్యత్తులో కూడా పెరగబోతుందా?...దేశంలో అసహనం అనే పదం చక్కర్లు కొట్టడానికి రాజకీయ, ఆర్ధిక, సామజిక, కొంత వరకు అంతర్జాతీయ కారణాలు అనేకం ఉన్నాయి.దేశం కోసం , దేశ పరువు కోసం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే అవన్నీ మన కళ్ళ ముందు కదలాడతాయి.



మనదేశంలో పుట్టినందుకు మనం ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాం . అదేం ఖర్మో తెలీదు కానీ దేశంలో పరిస్థితుల గురించి ఎప్పుడూ అసహనం వెల్లగక్కుతూనే ఉంటాం. నిద్రలేస్తూనే ఇంట్లో నీళ్లు రాలేదని , పడుకోబోయే ముందు కరెంటు లేదనీ ప్రభుత్వాలపైన అసహనం వెల్లగక్కుతాం. ఆఫీసుకి / స్కూల్ కి వెళ్ళడానికి రోడ్డెక్కిన మనం ట్రాఫిక్ కి ముందు వాడే కారణం అంటూ అసహనం వెల్లగక్కుతాం, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించుకోవడం చేతగాని మనం అధికారులందరూ లంచగొండులని అసహనం వెల్లగక్కుతాం, నాణ్యమైన విద్యా- వైద్య సదుపాయాలు అందించలేదని మనమే అందలం ఎక్కించిన రాజకీయ నాయకులపైన అసహనం వెల్లగక్కుతాం, రిజర్వేషన్స్ పైన కొందరం అసహనం వెల్లగక్కుతాం, వరకట్నంపైన అసహనం వెల్లగక్కుతాం, ఆడపిల్ల పుట్టిందని దేశంలో కొంత మంది అసహనం వెల్లగక్కుతారు, పేద – ధనిక అంతరాలకి కారణం ప్రభుత్వ విధానాలే అని అసహనం వెల్లగక్కుతాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇలాంటి ఎన్నో సామాజిక, ఆర్ధిక విషయాలపైన మనలో మనమే అసహనం వెల్లగక్కామం. కానీ ఇప్పటిలా, ఇంతలా ఎప్పుడూ అసహనం గురించి మాట్లాడుకోవడం, రోడ్లెక్కడం జరగలేదు. కానీ ఈ మధ్య ఈ “అసహనం” అనే పదం చక్కర్లు కొట్టడానికి రాజకీయ కారణాలు లేకపోలేదు.



కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీయే అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీయేతర పార్టీలు రాష్ట్రాలను ఏలుతున్నాయి . వీటిలో చాలా మటుకు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పార్టీలు. వ్యతిరేకం అంటే , సిద్ధాంతపరంగా, ఓటు బ్యాంకు పరంగా వ్యతిరేకం. దాదాపు 17 రాష్ట్రాల్లో ( అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ , కర్నాటక , కేరళ, మణిపూర్ , మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాకుండా బీహార్, ఢిల్లీ , ఒడిశా , తమిళనాడు , తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి) భారతీయ జనతా పార్టీయేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పరిచాయి. ఈ రాష్ట్రాలు తమ ఉనికి కోసం , తమ ఓటు బ్యాంకు కోసం భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటాయి. ఆ విమర్శలు భారతీయ జనతా పార్టీకి పరిమితమవ్వాలే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని , ప్రధానిని నిందించే దాకా వెళ్ళరాదు. అలాగే దేశంలో ఈ మధ్య అసహనపు మాట చక్కర్లు కొట్టడానికి కొందరు భారతీయ జనతా పార్టీ M.P ల వైఖరి కూడా కారణం అయ్యిండొచ్చు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు అలాంటి వారిని అదుపులో ఉంచితే అది భారతీయ జనతా పార్టీకే కాదు దేశానికి కూడా మంచిది. అలాగే భారతీయ జనతా పార్టీలోని కొందరు M.P ల వ్యక్తిగత మాటలని , కొందరు పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి అంటగడుతున్నారు, ఇది సమంజసం కాదు. ఇక కొందరు సినిమా తారలు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చే ముందు అవి భారతదేశంపైన ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించుకొని మాట్లాడాలి, ఈ దేశం ఆ తారలకు ఎంతో ఇచ్చింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఈ దేశంలో అసహనమే రాజ్యం ఏలుతుంటే వారు అంత గొప్పవారు అయ్యేవారు కాదు, భారతీయుల్లో అసహనం లేదు అనడానికి వాళ్ల ఎదుగుదలే కారణం.



ప్రపంచానికి శాంతి- సహనం నేర్పించిన గౌతమ బుద్ధుడు జన్మించిన భారతదేశం మనది. సూర్యుడస్తమించని రాజ్యానికి పడమటి దారులు చూపించిన శాంతి దూత , సహనశీలి అయిన మహాత్మాగాంధి నడయాడిన దేశం మనది. నేను – నా దేశం అనే దాంట్లో , నేను నా దేశానికే ఎక్కువ విలువనిస్తాను అని చాటిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుట్టిన గడ్డ మనది. సర్వమానవ సౌబ్రాత్రుత్వం నేర్పిన వివేకానంద ఊపిరిలూదిన జాతి మనది. ఒక బ్రహ్మచారి (ఈ శతాబ్దపు నవయుగ పురుషుడు - కలాం) పరమపదిస్తే యావత్ భారతజాతి కన్నీటి సంద్రంలో మునిగిన జాతి మనది. ఈ దేశ పౌరులను ఎందరినో ఊచకోత కోసిన కసబ్ లాంటి వాళ్లని పందుల్లా మేపేటంతటి సహనపు దేశం మనది. ఈ దేశంలో ఉంటూ, జాతీయవాదం కన్నా అంతర్జాతీయ భావాలకు విలువనిచ్చే రాజకీయ పార్టీలను భరిస్తున్న దేశం మనది. జాతీయ గీతాలాపనకి గౌరవం ప్రకటించకపోవడం తమ మతాభీష్టం అన్నా కూడా సహించేటంత సహనం మనది.


ఒక దేశంలో ఉండాల్సిన ముఖ్యమైన వాటిలో జాతీయవాదం – దేశభక్తి అత్యంత ప్రధానమైనవి. మనం ఎంత కాదన్నా ప్రస్తుతం మన దేశంలో ఈ రెండూ చాలా చాలా తక్కువ మొతాదులోనే ఉన్నాయి. ఈ రెండూ లేనంత వరకు మనం, అసహనం అంటూ రోడ్లెక్కుతాం, గోల చేస్తాం. దేశంలో వీచాల్సినవి మంచి- చెడు అనే పవనాలే కానీ కాషాయానికి అనుకూల పవనాలు , కాషాయానికి వ్యతిరేక పవనాలు కాదు. అది దేశ భవిష్యత్తుకి అవరోధమే కాదు మన ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకుల, పార్టీల సైద్ధాంతిక విధానాలు వేరైనప్పటికీ వాటన్నిటినీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవద్దు. ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ పరువు – ప్రతిష్టలను దయచేసి పణంగా పెట్టొద్దు. ఇప్పటికే చాలా దేశాలు మనదేశం ఎప్పుడు దిగాజారుతుందా అని గుంటకాడి నక్కలా ఎదురు చూస్తున్నాయి. మీరు అలాంటి నక్కలకి ఊతం ఇవ్వొద్దు..ఇక భారతీయ పౌరలమైన మనం ప్రతి అడ్డమైన వాడి మాటకు విలువనివ్వొద్దు. చదువుకున్న చదువు , ఆ చదువు నేర్పిన సంస్కారం మంచేదో – చెడేదో బేరీజు వేసుకునేలా ఉండాలి. మనం ఎప్పుడూ మంచికే ఊతమివ్వాలి , ఆ మంచిలో జాతి ప్రయోజనాలుండాలి.ఇంకా ముఖ్యమైన విషయం- వ్యక్తిగత పురోభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి ఉపయోగపడని ఎలాంటి విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. అది దేశానికి , మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది.



ప్రపంచ దేశాలకు విలువలు , సంస్కృతి , సంప్రదాయాలు , నేర్పిన భారతదేశంలో అసహనం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా లేదు. ఒకవేళ ఉంటె అది ఏ కొందరికో, కొన్ని కారణాల వల్ల ఏర్పడిన అసహనాలే తప్ప వేరే ఇంకేం కాదు. 125 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో, దేశపు పరిస్థితులు పట్టించుకోకుండా చాలా మంది ఎంతో హాయిగా జీవిస్తున్నారు. దాంట్లో కొందరు మహానుభావులు తమ తమ వ్యక్తిగత అసహనాన్ని దేశానికి ఆపాదిస్తున్నారు. భారతదేశంలో సహనం తప్ప అసలు “అసహనం” అనే పదమే లేదు. “సర్వే జనః సుఖినో భవంతు” అనే దేశంలో అసహనం ఉందనడం ఒక అపహాస్యమే తప్ప ఇంకోటి కాదు.

గమనిక: ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, తస్లిమా నస్రీన్, లాంటి కొన్ని ఉదాహరణలు ఈ మధ్య చదివా. వాటిని కూడా ఇక్కడ రాస్తే కొందరు “ అసహనవాదులు” నన్ను కూడా కాషాయపు రంగులో ముంచేస్తారేమో...

భరతమాతా!!!!...కాపాడు నీ బిడ్డలని అందరినీ

జై హింద్...🖋️🇮🇳

No comments:

Post a Comment