Saturday, 19 March 2016

“గ్రామ ‘‘పంచాయితీ’’లు”

“గ్రామ ‘‘పంచాయితీ’’లు”



ఓటరు మహానుభావుడు తాత్కాలిక ఆనందాలైన మద్యం, డబ్బుకు దాసోహమయ్యి ఓటు వేశాడంటే శాశ్వత బాధ అనుభవించాల్సి వస్తుంది...అభ్యర్థి ఇచ్చిన డబ్బుకి, మద్యానికి ఓటరువయిన నువ్వు బానిసవయ్యావంటే ఆ అభ్యర్థికి కూడా నువ్వు బానిసయినట్టే లెక్క...ఒక్కసారి ఎన్నుకొన్న వ్యక్తిని తొలగించే (రీకాల్ ) విధానం మన దేశం లో చాల మటుకు లేదు.ఇక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్తులని తిరస్కరించే నకారాత్మక (నెగటివ్ పోలింగ్) విధానం అసలేలేని ప్రజస్వామ్య దేశం మనది.ఒక్కసారి వివాహం చేసుకున్నాక మొగుడో/పెళ్ళామో అవసరం లేదని కోర్టు మెట్లు ఎక్కొచ్చేమో కానీ ఒక్కసారి ఎన్నుకున్న నాయకుణ్ణి వదిలించుకునే అవకాశం అసలే లేదు.ఒక అవినీతి నాయకుడ్ని, డబ్బుతో ఓట్లు కొనే నాయకుడ్ని ఎన్నుకున్నట్టయితే అది చేతులు కాలాక ఆకులు పట్టే చందంగా ఉంటుంది. కాబట్టి ఓటు వేసే ముందు అంతకుముందు కొన్ని రోజుల క్రితం జరిగిన కొన్ని ఆకర్షక పరిణామాలకు విలువ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు జనాలకి సేవ చేసే నాయకుడ్ని ఎన్నుకుంటేనే రాజ్యాంగం మనకు ప్రసాదించిన రాజకీయపు హక్కుకు విలువనిచ్చిన వాళ్ళం అవుతాం.లేకపోతే ఐదు సంవత్సరాల పాటు బాధపడాల్సి రావొచ్చు.



         ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనం గ్రామ పంచాయితీలు మరియు గ్రామసభ.నిస్వార్థ ప్రేమకు, నిజాయితీ నాయకత్వానికి గ్రామపంచాయితీలు పట్టుకొమ్మలుగా ఉంటూ ప్రజలకు సేవచేసేవి...అసలు సిసలైన భారతదేశం గ్రామాల్లోనే నెలవై ఉంటుందని గాంధీగారి విశ్వాసం...ఒకప్పుడు ఊరి పెద్దని సర్పంచిగా ఎన్నుకొనేవారు...దాదాపుగా పంచాయితీలన్ని ఏకగ్రీవం అయ్యేవి...అటు పిమ్మట పోటీ నెలకొనడం వల్ల ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలిచేవారు..ఆ పోటీకూడా నామమాత్రంగా మరియు చాలా సానుకూల పరిస్థితుల్లో జరిగేది..గెలిచినా-ఓడినా ప్రత్యర్థుల్లో ఎలాంటి ద్వేషపూరిత భావనలు ఉండేవికావు...ఎవరు గెలిచినా ఊరి బాగుకోసం పాటుపడాలని కోరుకొనేవారు...ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉండడమేగాక రాజకీయవిశ్లేషకులకు, రాజకీయాలు అవగాహన ఉన్న ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్య భావనపై భయం కలిగిస్తున్నాయి...వ్యవస్థలో మంచితో పాటు చెడు కూడా వ్యాప్తి చెందుతుంది...ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధం చేయడం వాటికి ఎన్నుకునే నాయకులకు రిజర్వేషన్ల ద్వారా ఎన్నుకోవడం అనేది మహామంచి అనుకుంటే...ఇక చెడంటారా ఆ రిజర్వేషన్లు కొంత వరకు దుర్వినియోగం అవడం..


          దుర్వినియోగం అంటే రిజర్వేషన్స్ ఇవ్వడం దుర్వినియోగం కాదు..రిజర్వేషన్ కల్పించడం ద్వారా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రజలందరికీ నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పించడం భారతరాజ్యాంగం యొక్క గొప్పతనం...కానీ రిజర్వేషన్ చేజిక్కించుకున్న కొందరిని ధనబలం, భుజబలం, అధికారబలం ఉన్న కొందరు బడాబాబులు-దొరలు ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టే కాక భారతాభివృద్ధి అవరోధం కూడా... ఎంతో నిరీక్షణ తర్వాత వచ్చిన గ్రామ పంచాయితీ నోటిఫికేషన్ అవ్వడం, తర్వాత సంవత్సరంలోపునే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం మూలంగా రాజకీయపార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి...పార్టీలకు అతీతంగా జరిగే పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీ మూలాలు చొప్పిస్తున్నారు..కొందరు సెంటిమెంట్ పేరుతో మమ్మల్నే గెలిపించాలంటే, కొందరు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే మీకే మంచిదంటున్నారు, ఇంకొందరు మమ్మల్ని గెలిపిస్తే మీకు రామరాజ్యం రుచిచూపిస్తామంటున్నారు...ఏది ఏమైనప్పటికీ పంచాయితీ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగబోతున్నాయి...ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థుల హవా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి...ఎందుకంటే ప్రధానపార్టీలను డీకొనేటంత ధనబలం, భుజబలం, అధికారబలం స్వతంత్ర అభ్యర్థులకు లేకపోవడం..అంతేకాదు నిజాయితీపరులైన అభ్యర్థులను ఓటరు మహాశయుడు ఎన్నుకొనే దాఖలాలు ఆ అభ్యర్థులకు కనిపించట్లేవు....ఇక వార్డు మెంబర్ల సంగతి చెప్పనే అక్కర్లేదు వారిని కూడా ఏదో ఒకపార్టీ బలపరుస్తున్న దాఖలాలు కోకొల్లలు...


             ఇంతలా అధికారదాహం సమాజంలో రావడానికి ప్రధానకారణం డబ్బు....అవును....ముమ్మాటికీ డబ్బే...నేను నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో చదివాను పోయిన ఎన్నికల్లో శంషాబాద్ గ్రామ పంచాయితీ సర్పంచ్ సీట్ ని ఒక వ్యక్తి అక్షరాలా 5కోట్లు వెచ్చించి సొంతం చేసుకొన్నాడు.....కళ్ళు బైర్లుగమ్మే ఈ భారీమొత్తం ‘‘ప్రజాస్వామ్యం’’ ప్రతీక ‘‘ధనస్వామ్య’’ ప్రతీక...ఏకగ్రీవం ముసుగులో ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చాలా జరుగుతున్నాయనేది సందేహాస్పదమేకాక ఆలోచనాత్మకం....రాష్రంలోని దాదాపు 21000 పంచాయతీల్లో రమారమి 2100 పైచిలుకు గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయినట్టు ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది....అలాంటి ఏకగ్రీవాల్లో ఎన్ని ‘‘ధనస్వామ్యం’’ అయిన ఏకాగ్రీవాలున్నాయో ఎలక్షన్ కమీషన్ తేలుస్తానని ప్రకటించింది.....అంత డబ్బు వెచ్చించి పదవిలోకి వచ్చిన వ్యక్తి ఎంత వరకు ప్రజలకు నిజాయితీగా, నిస్వార్థంగా, అంకితభావంతో సేవలందిస్తాడనేది ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాల్సిన విషయం.మన స్వతంత్ర భారతాన రాజ్యాంగం ఓటరు మహానుభావుడికిచ్చిన దాన్ని వరంగా మార్చుకుంటాడో పనికిమాలిన నాయకుడిని ఎన్నుకుని ఆ అవకాశాన్ని శాపంగా మార్చుకుంటాడో ఓటరే నిర్ణయించుకోవాలి.ఓ ఓటరు మహాశయా వరమా-శాపమా నిర్ణయం నీదే.
జై హింద్

No comments:

Post a Comment