"దేవుడు రిటైర్ అవుతాడా?"....
అతని సహనం ఒక ఎవరెస్టు పర్వతం, అతని పరుగు ఒక గంగానది ప్రవాహం , అతని దేశభక్తి అందరి భారతీయుల గుండెచప్పుడు..అందుకే అతడు ఇంత మంది భారతీయుల గుండెల్లో నిలిచిపోయాడు, నిలిచిపోతాడు...అలా నిలిచిపోయి మనందరి భారత రత్నమయ్యాడు.....విజయాన్ని పొందడానికి ఎటువంటి అడ్డదారులు లేవు అంటూ మొదలెట్టిన స్పీచ్ వింటున్న భారతీయుల గుండెల్లో ఎంతో స్పూర్తిని నింపాడు.....అతడు మాట్లాడుతుంటే గుండె బరువెక్కింది...మనసులో ఏదో తెలియని బాధ.....అతడు మాట్లాడినంత సేపూ ఏడుస్తూనే ఉన్నా....అక్క వాళ్లింట్లో ఉన్నా...చుట్టూ పిల్లలున్నారూ....అందరు నన్ను చూస్తున్నారూ అనే విషయమే పట్టించుకోవట్లేదు..ఏడుస్తూనే ఉన్నా....మధ్య మధ్యలో అల్లుడూ/కోడలూ వచ్చి మామా! ఏడుస్తున్నావా? అని ఆశ్చర్యపోతూ ఆటపట్టిస్తున్నారూ...కానీ నాకవేమి పట్టనట్టు ఏడుస్తూనే ఉన్నా..ఎంతో ధైర్యంగా ఉండే నేను, ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటేనే కోప్పడే నేను ఏడుస్తూనే ఉన్నా...సచిన్ అంటే నాకు చాలా అభిమానం అని తెలుసు, కానీ నాకు తెలియని విషయం ఏంటంటే నాకన్నా నా గుండెకి అతడంటే ఎక్కువ ప్రేమని, కాదు పిచ్చని అది ఈ రోజు అది నాతో కంటతడి పెట్టించేదాకా తెలియదు...ఏడుస్తూ, ఏడుస్తూ బరువెక్కిన ఆ గుండెబరువు ..స్నానం చేసి ఫ్రెష్ అయితేనే కానీ తగ్గలేదు..
1989 నవంబర్ 15 న అతడు ఆరగ్రేటం చేసిన సరిగ్గా 24 సంవత్సరాల ఒక్కరోజుకి అతని ఆటకి గుడ్ బై చెప్పాడు.... స్వతహాగా క్రికెట్ అంటే పడి చచ్చే నేను, నా చిన్ననాటి నుండి ఎంతోమంది భారత క్రికెట్ క్రీడాకారుల ఆటను చూసా, వాళ్ల రిటైర్మెంట్ ని కూడా చూసా....నాకు తెలివి వచ్చినప్పటినుండి చూసిన క్రికెటర్లలో దిగ్గజాలైన ద్రావిడ్, గంగూలీ, లక్ష్మన్, కుంబ్లే, శ్రీనాథ్, అజారోద్దీన్, లాంటి వాళ్లతో పాటుగా నేను అభిమానించే కొందరు విదేశీ క్రికెటర్లు మరియు మన దేశపు కొందరు చోటా మోటా క్రికెటర్లు, క్రికెట్ ని వదిలి వెళ్లినప్పుడు రాని కన్నీళ్లు ఈ రోజే ఎందుకొచ్చాయి? అని మధ్యాహ్నం నుండి ఆలోచిస్తున్నా....అందుకు ఒక్కటే సమాధానం.....నా కన్నీళ్లకు ఒక్కటే కారణం....అది....ది గ్రేట్.....సచిన్ రమేష్ టెండూల్కర్ వ్యక్తిత్వం ...
మా వాళ్ల అల్లరికి అతని మాటలు వినిపించక టీవీకి ఇంకా దగ్గరగా వెళ్ళిపోయా....అతని మాటలు ఆకట్టుకున్నాయి.....అతని వ్యక్తిత్వం ఇంకా ఆకట్టుకొంది....అతడు ఎదగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతుంటే అతని కృతజ్ఞతా భావంతోపాటుగా జీవితంలో అంత ఎత్తుకు ఎదిగీ మూలాల్ని మరిచిపోని అతని నిరాడంబరత కనిపిస్తుంది...తనకి మొదటి బాట్ కొనిచ్చిన తన సోదరి సవిత ఆప్యాయతని, నాన్న గారు అందించిన వ్యక్తిత్వాని, అమ్మ ప్రేమని, తన వైద్య వృత్తిని వదిలేసి కుటుంబ బాధ్యతల్ని మోస్తున్న భార్య అంజలి సహకారాన్నీ, తనని అర్థం చేసుకునే తన పిల్లల ప్రేమనీ, కెరీర్ పరంగా ప్రోత్సహించే నితిన్ సోదర ప్రేమనీ, మిత్రుల ప్రోత్సాహాన్ని, తనను ఎంతగానో అభిమానించే అభిమానుల అభిమానాన్నీ ,తన మధుర స్మృతులను తమ కెమెరాలో బంధించే ఫోటోగ్రాఫర్ లనీ, మీడియా వాళ్ళనీ, ఎప్పటికీ మరిచిపోలేననీ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.....
ఈ రోజు అతని మాటలు యావత్ భారత జాతికి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలన్న గొప్ప విషయాలని తెలుపుతున్నాయి....సచిన్ నుండి నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా విషయాలున్నాయి.....ఏ పని చేసిన మనసు పెట్టి చెయ్యడం, పూర్తిగా అంకిత భావంతో చెయ్యడం, మొక్కవోని దీక్షతో ప్రాక్టీస్ చెయ్యడం...మనపైన మనకు నమ్మకం ఉంటే విద్యారంగానే కాదు ఏ రంగాలోనైనా ఎదగొచ్చని నిరూపించాడు..ఎంత మంది ఎన్ని మాటలన్నా...ఎంత మంది ఎంత విమర్శించినా కేవలం బాట్ తోనే సమాధానం చెప్పేవాడే కానీ ఏ రోజు తన నోటికి పని చెప్పలేదు...అతని ఆ వ్యక్తిత్వమే అతన్ని లెజెండ్ ని చేసింది....యావత్తు భారతజాతి ఆ చివరి ఆట క్షణాన దిగులు పడేలా చేసింది....కన్నీళ్లు పెట్టేలా చేసింది....ఓ! క్రికెట్ దేవుడా నీవు ఆడిన ఆ వీడియోలు భవిషత్ క్రికెటర్లకు డిక్షనరీలు, నీ ఫుట్ వర్కు వాళ్ల కి ఇంటి దగ్గర ప్రాక్టీసు చేసుకునే హోం వర్కు, నీ టైమింగ్ వాళ్లకి ఫ్యూచర్ డ్రీమింగ్....అందుకే ....నువ్వు రిటైర్ అయ్యింది ఆట నుంచే కాని మా మనసులో నుండి కాదు....క్రికెట్ బ్రతికున్నంత వరకు నువ్వు చిరంజీవి..అయినా దేవుడెక్కడయినా రిటైర్ అవుతాడా?.... ...
జై హింద్

No comments:
Post a Comment