Sunday, 5 March 2023

నీ "బలగం" ఎంత ?!



మట్టి విలువ తెలియని మనుషులకి, మనిషి విలువ తెలియని మనసులకి 

జననమైనా‌, మరణమైనా పెద్దగా తేడా ఉండదు.


కానీ,

మనసు విలువ తెలిసిన మనుషులకి
మట్టి వాసనకి పరితపించిపోయే మనసులకి
జననమింకొక బంధమవుతుంది - మరణమొక బాధ్యతనిస్తుంది

అలా జననంతో వచ్చిన ఓ బంధం తన మరణంతో మనిషి బాధ్యతలు గుర్తు చేస్తుంది,
ఇంకా చెప్పాలంటే ఆ మరణం మనల్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఎన్నో  గొప్ప గొప్ప ప్రశ్నలను సంధిస్తుంటుంది.
బహుశా దీన్ని స్మశాన వైరాగ్యం అంటారని కొందరంటారేమో!!! అయ్యుండొచ్చు.

అది స్మశానవైరాగ్యమా !!! మరణం చెప్తున్న గొప్ప పాఠమా అర్థం కాదు కొన్ని సార్లు. మరణభావం తాలూకు భారం అర్థం కాదేమో కానీ భావం మోసుకొచ్చిన బాధ్యత మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది. అందుకే అప్పట్లో " ఆ నలుగురు" అంతలా నచ్చింది. ఇప్పుడు ఈ " బలగం" ఇంతలా నచ్చింది.

ఏం ఉంది ఈ కథలో  అంటారా!!!
దాదాపు అన్ని కథలు జననంతో మొదలైతే ఇది పెద్దాయన మరణంతో మొదలై ప్రేక్షకుల ఆత్మీయ జననంతో ముందుకు సాగింది. ఇదంతా కాదు కానీ అసలు ఆ కథలో ఏం ఉంది కొంచెం చెప్పు అంటారా. ఇదిగో ఇవి ఉన్నాయి

బాధంటూ లేని లోకానికి
బయలెల్లిపోయిన బంధం విలువ తెలిపే బలమైన కథే బలగం

స్వార్థంతో సవారీలు చేస్తున్న చిన్న కుటుంబాలకే ఒక గొప్ప మనసుంటే వారి కుటుంబం పెద్దదవుతుందని చెప్పకనే చెప్పే కథే బలగం

ఆడుతూ పాడుతూ అందరినీ పలకరించే ఒక  మనసు
ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తరువాత జరిగే పరిణామాల గురించి తెలిపే కథే బలగం

కలిసుండాలంటే మమకారాలుంటాయి విడిపోవాలంటే కారణాలు, కయ్యాలుంటాయని తెలిపే కథే బలగం

బతికున్నప్పుడు బాగోగులు అడగని వారు కాస్తా
బయలెల్లిపోతున్న శవం ముందు చెప్పే అబద్ధాలను చూపించే కథే బలగం

ఆత్మీయతలను, అనురాగాలను ఆర్థిక పరమైన వైరుధ్యాలు ఎలా నాశనం చేస్తాయని చెప్పే కథే బలగం

ఇంకా ఎన్నో రకాల ప్రశ్నలను ఈ "బలగం" సంధిస్తుంది వాటన్నింటికీ సమాధానాలు కూడా చెపుతుంది. మనకి కావాల్సిందల్లా "బలగం" వేసే ప్రశ్నలు అర్థం చేసుకునే పరిపక్వత ఉండాలి, "బలగం" చెప్పే సమాధానాలు వినేంత వినయం ఉండాలి. నేను మొత్తంగా చెప్తే "బలగం" బలహీనపడొచ్చు. అలా మన బలగాన్ని బలహీనపరిస్తే మనకే మంచిది కాదు. అందుకే తప్పకుండా మీ "బలగం"తో వెళ్లి ఈ "బలగం" చూసి ఆ"బలగం" విలువ గురించి అందరికీ చెప్పండి.

ఇంకో చిన్న మాటతో ముగిస్తాను,

Note :
అహానికి, అహంకారానికి మనిషిలో స్థానం ఇస్తుంటే
ఆప్యాయతలు, అనురాగాలు మనస్సులోంచి అలిగి వెళ్లిపోతుంటాయి
( బలగం పెంచుకుంటూ .....మళ్ళీ కలుద్దాం ...🖋️💐)

మీ ప్రసాద్ గౌడ్