Saturday, 13 May 2023

అమ్మతో Mother's Day



ఈ మదర్స్ డే రోజ

అమ్మకి ఇష్టమైన పనులు చేయాలని,

అమ్మకి ఇష్టమైన వాటిని చూపించాలని,

అమ్మకు ఇష్టమైన పదార్థాలు తినిపించాలని ,

నేను గట్టిగా కంకణం కట్టుకొని మరి ఈ మదర్స్ డే ప్లాన్ చేశాను



మదర్స్ డే రోజు ఎలాగైనా అమ్మతోనే రోజంతా గడపాలని ఎన్ని రోజులుగా ప్లాన్  చేస్తూ వస్తున్న కుదరడం లేదు. ప్రతీ సంవత్సరం నిరాశ నన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని నేను ఎదురు చూడని రోజు లేదు. అలా Mother's Day రోజు కోసమే ఎందుకు ఎదురు చూడటం ఏదో ఒక రోజు అమ్మతో ఉండొచ్చు కదా అని నా మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నా మనస్సే కాదు నా కోరిక తెలిసిన ఎవరైనా నా మనసు లాగే ఫీల్ అవుతారు. కానీ ఎంత మందికి అని చెప్పేది నేను ఊహ తెలిసినప్పటి నుండి హాస్టల్ చదువులు చదివాను అని చదువులు అయ్యాక మంచి ఉద్యోగం వస్తే అమ్మకి దూరంగా వెళ్ళేంత ఎదిగానని. అలా జీవితంలో అమ్మకి దగ్గరగా ఉన్నది తక్కువ, దూరంగా వెళ్ళింది ఎక్కువ. అమ్మతో గడిపిన రోజులని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు ఏమో. అందుకే, ఇన్నాళ్లకు, ఈ రోజు, మనస్సు అంతరాలాలో దాగి ఉన్న ఆ కోరిక నెరవేరబోతుంది అనే ఊహతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నా. ఐనా నా పిచ్చి కాకపోతే ఇదొక కోరికా అని కూడా అనిపిస్తుంది. కానీ నాకే అర్థం అయ్యే ఒక బాధతో నిండిన కోరిక నాది. అలా ఆలోచనలతో నిద్రలేచాను.

 

ఈ రోజు పొద్దున్నే అమ్మను లేపి గుడికి వెళ్దాం అనగానే అమ్మ షాక్ లో కళ్ళు తెరిచి చూస్తుంది. ఎందుకంటే నేను అంత పొద్దున్న లేవడం ఒక ఎత్తు ఐతే గుడికి వెళ్దాం అనడం ఇంకో ఎత్తు. ఎందుకూ అంటారా? అమ్మకేమో గుడికి వెళ్లడం ఇష్టం, నాకేమో దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అని ఇంట్లోనే దండం పెట్టుకోవడం ఇష్టం. నీతో వితండవాదం చెయ్యలేను లే దేవుడిని వెతుక్కుంటూ నువ్వే వెళతావు అని అమ్మ బుజ్జగిస్తూ తిట్టేది, నేను నవ్వి ఊరుకేనేవాడిని. గుడికి రమ్మని అమ్మ నన్ను ఎప్పుడూ బలవంత పెట్టలేదు, అమ్మ పిలుస్తుంది కదా అని నేనూ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే ఈరోజు ఇలా అమ్మకు ఇష్టమైన  పనితో మొదలు పెడదాం అని గుడికి వెళ్దాం అని ఫిక్స్ అయ్యి అమ్మని లేపాను. అమ్మ ఒక రకమైన సందేహం, ఆశ్చర్యంతోనే గుడికి రెడీ అయ్యింది.

అమ్మా నేను ఉదయం ఏడు గంటలకి బిర్లా మందిర్ చేరుకున్నాం, సండే కదా జనాలు ఎక్కువగా ఉండటంతో మాకు దర్శనం కొంచం ఆలస్యం అయ్యింది. మా కడుపులో రాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి అప్పటికే . ఎప్పుడూ వంట చేసే అమ్మకు ఈ రోజైనా రెస్ట్ ఇద్దామని ఈ రోజంతా బయటనే తినాలని కూడా ప్లాన్ చేశాను కాబట్టి ఫుడ్ ప్యాక్ చేస్తా అన్నాకూడా వద్దని ఇంటి దగ్గరే చెప్పేసా. సో, దగ్గరలో ఒక దోశ బండి ఫేమస్ అని తెలిసి అక్కడికి వెళ్లి టిఫిన్ తిన్నాము. అక్కడ నుండి మళ్ళీ పెద్దమ్మ గుడికి వెళ్ళాము. ఇక్కడ కూడా పెద్దమ్మ గుడి అమ్మలతో, పిల్లలతో నిండిపోయింది, మథర్స్ డే స్పెషల్ కదా మరి. అమ్మ నేను ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము.

 

గుడిలో నుండి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. అట్నుంచి అటే బిర్యాని మాల్ కి వెళ్ళాము అక్కడ అమ్మకి ఇష్టమైన మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పి అంతకంటే ముందుగా స్టార్టర్ గా చికెన్65 తో పాటుగా పత్తర్ ఘోష్ అపోలో ఫిష్ ఆర్డర్ చేశాం ఇవన్నీ తినేసరికి 1:30 అయ్యింది . అమ్మకి ఇష్టమైన వాటిలో సినిమా చూడడం ఇంకొకటి. ఇష్టం అనేదాని కంటే పిచ్చి అంటే బెటర్ . అవును అమ్మకి సినిమా చూడటం పిచ్చి. అందుకే అట్నుంచి అటే ఇనార్బిట్ మాల్ లో చిరంజీవి మూవీ ఉంటే వెళ్ళాము చిరంజీవే అని ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మకు చిరంజీవి అంటే అంత ఇష్టం మరి. చిరంజీవి స్క్రీన్ పైన కనిపించగానే అమ్మ విజిల్ వేస్తూ చిన్నపిల్లలా అరవడం నాకు భలే ఆశ్చర్యం వేసింది. అమ్మ ఏంటమ్మా ఇలా మల్టీప్లెక్స్ లో విజిల్ వేయడం అంటే మల్టీప్లెక్స్ అయినా ఇంకో థియేటర్ అయిన కొన్ని ఎమోషన్స్ అలా ఆపుకోవద్దురా. నాకు విజిల్ వేయాలి అనిపించింది వేసా, ఇదేం గుడి కాదు కదా సైలెంట్ గా కూర్చోడానికి అన్నది. అమ్మ చెప్తున్నది కూడా నిజమే కదా అనుకోని సినిమా చూడటంలో లీనం అయ్యాం. ఐనా ఎవరి లాజిక్కులు వారికుంటాయి కదా.

 

సినిమా అయిపోగానే బయటకు వస్తూ డిన్నర్ లోకి ఏం తిందామని అమ్మని అడిగితే ఏదైనా లైట్గా తిందాం రా మధ్యాహ్నం తిన్నదే ఇంకా అరిగినట్టు లేదు అనేసరికి కారుని సైబర్ టవర్స్ వైపుగా పోనిచ్చాను అమ్మకి ఇడ్లీ, నాకు ఎగ్ దోశ ఆర్డర్ చెప్పాను. అమ్మ నేను తినేసి మళ్ళీ కారు ఎక్కాం. ఇంటి వైపుగా వచ్చే ముందు అటువైపు ఫుట్పాత్ పైన ఎంతోమంది కనిపిస్తే అమ్మ కోరిక మేరకు ఒక హోటల్లో కొన్ని బిర్యాని ప్యాక్స్ పార్సెల్ చేయించి ఫూట్పాత్ మీద పడుకున్నవారికి ఇచ్చాను. ఆ బిర్యాని ఇచ్చాక వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి అమ్మ ఎంతో సంతృప్తి చెందింది. మనకు ఉన్నంతలో పదిమందికి సహాయం చేయాలని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అలా నాకు తోచిన సహాయం నా శక్తి మేరకు చేస్తుంటా అమ్మా అని ప్రామిస్ చేస్తుంటే అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఆమె పడిన ఎన్నో కష్టాలు గుర్తోచ్చుంటాయి కాబోలు. మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యింది. ఈ రోజు చాలా సంతోషంగా , సంతృప్తిగా గడిచింది రా.  నేను అలిసిపోయాను రా చిన్నా, నాకు ఇష్టమైన ఇళయరాజా పాటలు పెట్టు వింటూ పడుకుంటాను అంటూ అమ్మ నాతో ఇంకా ఏదో చెప్పబోతుంది. అప్పుడే, కలలు కన్నది చాలు లే అని నా దురదృష్టాన్ని గుర్తు చేస్తున్నట్టుగా  అలారం మోగడంతో హటాత్తుగా లేచాను. అలారం ఆపేసి బరువెక్కిన మనసుతో కళ్ళ నుండి వస్తున్న చుక్కలని పట్టించుకోకుండా చుక్కల్లోకెక్కిన అమ్మని తలుచుకుంటూ చిన్నా గాడు అమ్మ లేని మదర్స్ డే ని బాధతో ఏదోలా మొదలెట్టాడు.


Sunday, 5 March 2023

నీ "బలగం" ఎంత ?!



మట్టి విలువ తెలియని మనుషులకి, మనిషి విలువ తెలియని మనసులకి 

జననమైనా‌, మరణమైనా పెద్దగా తేడా ఉండదు.


కానీ,

మనసు విలువ తెలిసిన మనుషులకి
మట్టి వాసనకి పరితపించిపోయే మనసులకి
జననమింకొక బంధమవుతుంది - మరణమొక బాధ్యతనిస్తుంది

అలా జననంతో వచ్చిన ఓ బంధం తన మరణంతో మనిషి బాధ్యతలు గుర్తు చేస్తుంది,
ఇంకా చెప్పాలంటే ఆ మరణం మనల్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఎన్నో  గొప్ప గొప్ప ప్రశ్నలను సంధిస్తుంటుంది.
బహుశా దీన్ని స్మశాన వైరాగ్యం అంటారని కొందరంటారేమో!!! అయ్యుండొచ్చు.

అది స్మశానవైరాగ్యమా !!! మరణం చెప్తున్న గొప్ప పాఠమా అర్థం కాదు కొన్ని సార్లు. మరణభావం తాలూకు భారం అర్థం కాదేమో కానీ భావం మోసుకొచ్చిన బాధ్యత మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది. అందుకే అప్పట్లో " ఆ నలుగురు" అంతలా నచ్చింది. ఇప్పుడు ఈ " బలగం" ఇంతలా నచ్చింది.

ఏం ఉంది ఈ కథలో  అంటారా!!!
దాదాపు అన్ని కథలు జననంతో మొదలైతే ఇది పెద్దాయన మరణంతో మొదలై ప్రేక్షకుల ఆత్మీయ జననంతో ముందుకు సాగింది. ఇదంతా కాదు కానీ అసలు ఆ కథలో ఏం ఉంది కొంచెం చెప్పు అంటారా. ఇదిగో ఇవి ఉన్నాయి

బాధంటూ లేని లోకానికి
బయలెల్లిపోయిన బంధం విలువ తెలిపే బలమైన కథే బలగం

స్వార్థంతో సవారీలు చేస్తున్న చిన్న కుటుంబాలకే ఒక గొప్ప మనసుంటే వారి కుటుంబం పెద్దదవుతుందని చెప్పకనే చెప్పే కథే బలగం

ఆడుతూ పాడుతూ అందరినీ పలకరించే ఒక  మనసు
ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తరువాత జరిగే పరిణామాల గురించి తెలిపే కథే బలగం

కలిసుండాలంటే మమకారాలుంటాయి విడిపోవాలంటే కారణాలు, కయ్యాలుంటాయని తెలిపే కథే బలగం

బతికున్నప్పుడు బాగోగులు అడగని వారు కాస్తా
బయలెల్లిపోతున్న శవం ముందు చెప్పే అబద్ధాలను చూపించే కథే బలగం

ఆత్మీయతలను, అనురాగాలను ఆర్థిక పరమైన వైరుధ్యాలు ఎలా నాశనం చేస్తాయని చెప్పే కథే బలగం

ఇంకా ఎన్నో రకాల ప్రశ్నలను ఈ "బలగం" సంధిస్తుంది వాటన్నింటికీ సమాధానాలు కూడా చెపుతుంది. మనకి కావాల్సిందల్లా "బలగం" వేసే ప్రశ్నలు అర్థం చేసుకునే పరిపక్వత ఉండాలి, "బలగం" చెప్పే సమాధానాలు వినేంత వినయం ఉండాలి. నేను మొత్తంగా చెప్తే "బలగం" బలహీనపడొచ్చు. అలా మన బలగాన్ని బలహీనపరిస్తే మనకే మంచిది కాదు. అందుకే తప్పకుండా మీ "బలగం"తో వెళ్లి ఈ "బలగం" చూసి ఆ"బలగం" విలువ గురించి అందరికీ చెప్పండి.

ఇంకో చిన్న మాటతో ముగిస్తాను,

Note :
అహానికి, అహంకారానికి మనిషిలో స్థానం ఇస్తుంటే
ఆప్యాయతలు, అనురాగాలు మనస్సులోంచి అలిగి వెళ్లిపోతుంటాయి
( బలగం పెంచుకుంటూ .....మళ్ళీ కలుద్దాం ...🖋️💐)

మీ ప్రసాద్ గౌడ్