Thursday, 30 April 2020

శ్రీరంగం శ్రీనివాసునికి అక్షర నైవేద్యం


ఎక్కడికి రావాలయ్యా శ్రీ శ్రీ?
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తోందా?
మా ప్రపంచానికే దిక్కులేదు లేవయ్యా శ్రీ శ్రీ.

ఏమిచ్చావయ్య శ్రీశ్రీ నీవు?
ప్రపంచాగ్నికి సమిధొక్కటి ఆహుతిచ్చావా?
కులమతాల చిచ్చు పెట్టుటకు మేమూ ఇచ్చాం లేవయ్యా శ్రీ శ్రీ.


ఏమి అయ్యిందయ్యా శ్రీ శ్రీ నీకు?
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టిందా నిన్ను?
చస్తూ బ్రతికీడుస్తూ ప్రతిరోజూ మేమూ భయపడుతున్నాం లేవయ్యా శ్రీ శ్రీ.

ఏమన్నావయ్యా శ్రీ శ్రీ నీవు
హీనంగా చూడొద్దా దీన్నీ, కవితామయమేనా అన్నీ?
కపిత్వానికి వారసులమైన మాకే చెప్తావేమయ్యా శ్రీ శ్రీ.

ఏమన్నావయ్యా శ్రీ శ్రీ నీవు?
పుడమి తల్లి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్పురించాయా?
పుడమి తల్లి నాశనానికి పునాదులేస్తున్నాం లేవయ్యా శ్రీ శ్రీ.

ఎవరి కష్టం చెప్పావ్ అయ్యా శ్రీ శ్రీ నీవు?
దారి తప్పిన ఓ పల్లెటూరి బాటసారి కష్టమా?
మా కష్టానికే దిక్కులేదు లేవయ్యా శ్రీ శ్రీ.

ఎవరికోసం పాడతావయ్యా శ్రీ శ్రీ నీవు?
ఉడతల్లాంటి బుడతల్లాంటి కూనల కోసమా?
పాడటమెందుకని గర్భస్థ పిండంగానే చంపుతున్నాం లేవయ్యా శ్రీశ్రీ.

ఎవరి పాపం గురించి చెప్పావయ్యా శ్రీ శ్రీ నీవు?
అవ్వ మరణిస్తే ఆ పాపం ఎవరిదా?
పాపానికి మీనింగే తెలియని మనుషులం లేవయ్యా శ్రీశ్రీ.


ఎక్కడికి వెళ్తావు అయ్యా శ్రీ శ్రీ నీవు?
నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలి పోతావా?
నిర్ధాక్షణ్యంగా సెల్ఫోన్తో ఫోటోలు తీస్తాం లేవయ్యా శ్రీ శ్రీ.


ఏం చేస్తావ్ అయ్యా శ్రీ శ్రీ నీవు?
భవిష్యమును పరిపాలిస్తావా?
మా వర్తమానానికే మాకు దిక్కులేదు లేవయ్యా శ్రీశ్రీ.


ఏం ఏం వినబడుతున్నాయయ్యా శ్రీ శ్రీ నీకు?
ఏవేవో ఘోషల్ వినబడుతున్నాయా?
మాకేమో మానభంగం ఆక్రందనలూ, పేదవాడి పేగుల కేకలు వినిపిస్తున్నాయి లేవయ్యా శ్రీశ్రీ.


ఏదయ్యా నిజం శ్రీ శ్రీ
మనమంతా బానిసలం, పీనుగులమా?
నీ సంగతేమోగానీ మేమైతే అదేనయ్యా శ్రీ శ్రీ.

ఏం చెప్తున్నావయ్యా శ్రీ శ్రీ?
దగాపడిన తమ్ములార ఏడవకం డేడవకండనా?
దగాపడి నెత్తిన టోపీ పెట్టించుకోవడానికి మేమెప్పుడూ రెడీ లేవయ్యా శ్రీ శ్రీ.

ఏం చేయాలయ్యా శ్రీ శ్రీ?
ఈ లోకం మాదే నా మా రాజ్యం మేమేలాల?
ఓటేయడానికి వెళ్లలేని బద్ధకస్తులమయ్యా మేము శ్రీ శ్రీ.

ఎవరు చావాలి అయ్యా శ్రీ శ్రీ?
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులా?
ఐతే ఈ దేశ జనాభా తగ్గుతుంది లేవయ్యా శ్రీ శ్రీ.

ఏమన్నావయ్యా శ్రీ శ్రీ నీవు?
దొంగ లంజా కొడుకులసలే మసలే లోకమా?
అవునయ్యా, అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే వాల్లెందరో ఉన్నారు లేవయ్యా శ్రీ శ్రీ.

ఏముంది అయ్యా శ్రీశ్రీ  నీలో?
అభ్యుదయ భావజాలపు బూజు తప్ప
ఆ దుమ్ముదులిపి అందుకే నీట్ గా ఉన్నాం లేవయ్యా శ్రీ శ్రీ.

ఎవరివయ్యా శ్రీ శ్రీ నీవు?
అభ్యుదయోద్యమానికి ఆనవాళువా?
అనుదాత్త వస్తువుకి ఆత్మ బంధువువా?
మా నెత్తురు ఉడికించిన కవివా, పవివా?
విప్లవానికి నాంది పలికిన క్రాంతి రేఖవా?
ఎవరివయ్యా శ్రీ శ్రీ నీవు? ఎవరివయ్యా శ్రీ శ్రీ నీవు?